SIP is a good EMI. Here's why...
Every time you borrow money, you’re robbing your future self.
పొదుపుకీ ఒక రోజుంది!
పేదవారికి ఒక పూట తిండి పెట్టడం కాదు, బతికే మార్గం చూపాలంటారు. నేటి సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో ఆ స్థానాన్ని ఇప్పుడు పొదుపు ఆక్రమిస్తోంది. నెల జీతాల విధానంలో వచ్చిన డబ్బు వచ్చినట్లు ఖర్చు చేయడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ తలకిందులవుతోంది.
ఈ నేపథ్యంలోనే పొదుపు తెరమీదికి వచ్చింది. 1924లో ఇటలీలో తొలి అంతర్జాతీయ పొదుపు కాంగ్రెస్ సదస్సు సందర్భంగా అక్టోబరు 31ని అంతర్జాతీయ పొదుపు దినోత్సవంగా పరిగణించాలని నిర్ణయించారు. మనదేశంలో అక్టోబరు 30న సేవింగ్స్ డే జరుపుతున్నారు. పొదుపుని జీవనవిధానంలో భాగంగా చేసేలా పలురకాల కార్యక్రమాలు చేపట్టడం, పిల్లల్ని బ్యాంకులకు తీసుకెళ్లి అక్కడ జరిగే పనులను చూపించడం, యువతకు వర్కుషాపులు పెట్టడం... లాంటి పనులు చేస్తారు. బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో చిన్నమొత్తాల పొదుపు పథకాలూ, జన్‌ధన్‌యోజన లాంటివీ అలా ప్రారంభించినవే. ఖాతా అంటూ ఉంటే ఎంతో కొంత డబ్బు ఎప్పుడో అప్పుడు దాచుకోకుండా ఉండరన్నది ఆశ. |
పొదుపు మంత్రాలు!
పొదుపు చేయాలనే ఉంది కానీ ఎలా అని ఆలోచిస్తున్న యువతరానికి అమెరికాకి చెందిన ఫైనాన్స్ ఎక్స్‌పర్ట్ ఎరిన్ లోరీ చెబుతున్న చిట్కాలు కొన్ని...
* అవుట్ ఆఫ్ సైట్, అవుట్ ఆఫ్ మైండ్ అంటారు కదా, అందుకే డబ్బుని కన్పించకుండా దాచేయండి. జీతం రాగానే కొంత మొత్తం నేరుగా మరో పొదుపుఖాతాలోకి మళ్లించండి. ఏడాది తర్వాత ఫలితం చూడండి. * ఉద్యోగంలో చేరినా కొన్నాళ్లు స్టూడెంట్‌లాగే తక్కువ బడ్జెట్‌లో సర్దుకుపోండి. జీతం రాగానే కొంత మొత్తం మాత్రమే అకౌంట్‌లో ఉంచుకుని మిగతాదంతా ఫిక్స్‌డ్ డిపాజిట్స్, ఫండ్స్‌లాంటి వాటిల్లోకి బదిలీ చేయండి. కొన్నాళ్లకి అదే అలవాటైపోతుంది. * పొద్దున టిఫినూ మధ్యాహ్నభోజనమూ బయట చేస్తున్నారా? ఓ నెల ఎంత ఖర్చయిందో లెక్కవేయండి. ‘వామ్మో... ఇంత డబ్బు తిండికి ఖర్చుపెట్టానా’ అనిపిస్తే వెంటనే మానేసి ఇంటి నుంచి టిఫిన్ తీసుకెళ్లండి. మీరు గతంలో ఖర్చుపెట్టిన మొత్తానికి సమానంగా డబ్బుని నెలనెలా అమ్మ ఖాతాలోకి మళ్లించండి. మీకు ఆరోగ్యం. అమ్మకి సంతోషం. * షాపింగ్, డిన్నర్స్ అన్నీ కూడా ఆఫర్స్ ఉన్నప్పుడు చూసుకుని ప్లాన్ చేసుకుంటే అదనపు ఖర్చులుండవు. * క్రెడిట్ కార్డు ఎడాపెడా వాడితే జీతం అంతా దానికే సరిపోతుంది. అది పక్కన పెట్టి నగదు వాడండి. డబ్బు అయిపోతోందన్న స్పృహ ఉంటుంది. ఖర్చు తగ్గుతుంది. ఆ మేరకు పొదుపు అలవాటు చేసుకోవచ్చు. * బైక్ మానేసి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడండి. దానివల్ల మూడు లాభాలున్నాయి. ఇంటికైనా ఆఫీసుకైనా సమయానికి, సురక్షితంగా చేరుకోవచ్చు. బోనస్‌గా డబ్బూ మిగులుతుంది. దాన్ని పొదుపు ఖాతాలోకి మళ్లించొచ్చు. * డెబిట్ కార్డు ఇంట్లో పెట్టేసి బయటికెళ్తే చాలు. చాలావరకు ఖర్చులు తగ్గిపోతాయి. ఖర్చు మీద నియంత్రణ రావడానికి ఇదే ఉత్తమమైన పద్ధతి. * ఇల్లు, బైక్... ఇలా మీకు ఇష్టమైన దాని గురించి ఆలోచించండి. దానికి ఎంత డబ్బు కావాలో చూడండి. డబ్బు ఖర్చు చేస్తున్న ప్రతిసారీ అది గుర్తుచేసుకుంటే ఆటోమేటిగ్గా అనవసర ఖర్చులు తగ్గిపోతాయి. * ఏదైనా కొనేటప్పుడు మూడు ప్రశ్నలు వేసుకోండి... అది నాకు అవసరమా? ఎన్నిసార్లు వాడతాను? అది లేకపోతే వచ్చే నష్టమేంటి? ఈ మూడిటికీ సంతృప్తికరమైన సమాధానం ఉంటేనే కొనండి. అలా మూడు నెలలు చేశారంటే అప్పటికి మీ దగ్గర మిగిలిన డబ్బే మీరేం చేయాలో చెబుతుంది. Source : Ennadu Special Edtion |